ఫీజు రీయింబర్స్ మెంట్ ను కుటుంబంలో ఒకరికే ఇస్తూ లబ్దిదారుల సంఖ్య బాగా తగ్గించేశారు: గోరంట్ల

19-04-2021 Mon 14:09
  • ఏపీలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
  • స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని విమర్శలు
  • ఇంట్లో ఒకరికే ఫీజు చెల్లిస్తే మిగతా వారి పరిస్థితేంటన్న గోరంట్ల
TDP leader Gorantla slams Jagananna Vidya Deevena

ఏపీలో జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శనాస్త్రాలు సంధించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను కుటుంబంలో ఒకరికే ఇస్తున్నారని, తద్వారా లబ్దిదారుల సంఖ్యను బాగా తగ్గించేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ట్యూషన్ ఫీజులు చెల్లిస్తోంది ఎంతమందికి? అనే విషయాలకు సీఎం జగన్ బదులివ్వాలని అన్నారు.

కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే విద్యాశాఖ పథకాలకు పేర్లు మార్చుతున్నారని విమర్శించారు. అది కూడా సకాలంలో విద్యార్థులకు చెల్లింపులు జరపడంలేదని గోరంట్ల పేర్కొన్నారు. ఏపీలో నిధుల దుర్వినియోగంపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అన్నారు.

"జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలు మోసపూరిత కార్యక్రమాలుగా మారాయి. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు చదువుకునే వాళ్లు ఉంటే జగన్ ఒక్కరికే సాయం చేస్తానంటున్నాడు... మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? బైకులు ఉన్నాయని, విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఫీజుల చెల్లింపులు నిలిపివేయడం న్యాయమేనా? రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది" అని విమర్శించారు.