ఇదెంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా?: క‌రోనా విజృంభ‌ణ‌పై విజ‌య‌శాంతి

19-04-2021 Mon 10:24
  • కరోనా కేసుల విషయంలో సర్కారు గుట్టుగా వ్యవహరిస్తోంది
  • వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదు
  • జాగ్రత్తలేవీ లేకుండా ఒకేచోట అంద‌రినీ నిలబెట్టి టెస్టులు చేస్తున్నారు
  • పాలకుల పట్టింపులేనితనమే వారి పతనానికి నాంది
vijaya shanti slams trs

తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌ను ప్ర‌స్తావిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వంపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో కొవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. గత మూడు, నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికల్ని పరిశీలిస్తే కరోనా కేసుల విషయంలో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తోందో తెలుస్తుందని అన్నారు.

'ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు... బులిటెన్ ద్వారా ప్రకటిస్తున్న ఫలితాలు... వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదని ఆ నివేదికలు ఆధారాలతో సహా విశ్లేషించాయి. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి... ప్రభుత్వ వర్గాల అంకెలు వందల్లో ఉంటే వాస్తవ పరిశోధన ప్రకారం ఈ కేసులు వేలల్లో కనిపిస్తున్నాయి. గతేడాది ప్రభుత్వ వెబ్ సైట్‌లో కరోనా కేసుల గణాంకాలను కొన్నాళ్లు అప్‌డేట్ చెయ్యకుండా ఆపేస్తే హైకోర్టు మందలింపుల తర్వాత మళ్లీ కొనసాగించారు' అని విజ‌య‌శాంతి గుర్తు చేశారు.  
 
'ఈ వ్యవహారం ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టు అప్పట్లో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఒక కోణమైతే... పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు నరకానికి నకళ్లుగా ఉన్నాయి' అని విజ‌య‌శాంతి విమర్శించారు.
 
'కరోనా అనుమానితులు, అరోగ్యంగా ఉన్నవారు... రకరకాల వ్యాధిగ్రస్థులు... అందరినీ గుంపులుగా గంటల తరబడి భౌతిక దూరం, శానిటైజేషన్, ఇతర జాగ్రత్తలేవీ లేకుండా ఒకేచోట నిలబెట్టి టెస్టులు చేస్తున్నారు. ఇదెంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా? ప్రజారోగ్యాన్ని పక్కనపడేసి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఈ పాలకుల పట్టింపులేనితనమే వారి పతనానికి నాంది' అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.