218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

19-04-2021 Mon 10:03
  • వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓడినందుకు గుర్తింపు
  • 1988 నుంచి గల్లీ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్
  • గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడమే లక్ష్యమన్న పద్మరాజన్
Election King Padmarajan Achieved Indian Book Of Records

ఎన్నికల వీరుడిగా గుర్తింపు పొందిన తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన 62 ఏళ్ల పద్మరాజన్ 1988 నుంచి ప్రతి ఎన్నిల్లోనూ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 218సార్లు ఆయన నామినేషన్ వేశారు. స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఏ ఎన్నికలనూ వదలని పద్మరాజన్ తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామిపైనే పోటీకి దిగారు. అంతేకాదు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రత్యర్థిగా ధర్మడం నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ వేసినా తిరస్కరణకు గురైంది.

ఇప్పటి వరకు 218సార్లు నామినేషన్లు వేసిన ఆయన వార్డు సభ్యుడిగా కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. అయితే, గజనీ మహ్మద్‌లా దండయాత్ర చేస్తున్న ఆయన ఏదో ఒక రోజు విజయం వరించకపోదన్న ఆశతో ఉన్నారు. వందల సార్లు పోటీ చేస్తూ ఓటమి పాలవుతున్న ఆయనను గుర్తించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తమ రికార్డు పుస్తకాల్లో ఆయనకు చోటిచ్చింది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపించింది. తన పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కడంపై పద్మరాజన్ మాట్లాడుతూ.. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడమే తన లక్ష్యమని, అప్పటి వరకు పోటీ చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.