BJP: 2019-20లో 108 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ.. కనిపించని ఇతర పార్టీల లెక్కలు!

  • గడువు ముగిసినా ఈసీ వెబ్‌సైట్‌లో కనిపించని 41 పార్టీల ఆడిట్ రిపోర్టులు
  • 2018-19లో టీడీపీ ఆదాయం రూ. 91.53 కోట్లు
  • ఆదాయం కంటే రూ. 95.78 కోట్లను అధికంగా ఖర్చు చేసిన బీజేడీ
  • ఆడిట్ రిపోర్టులను సమర్పించింది 19 పార్టీలే
TDP spent Rs 108 crore in 2019 and 20 financial year

దేశంలోని 2 జాతీయ, 17 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ, వ్యయాల లెక్కలను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించిన గణాంకాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏడీఆర్ లెక్కల ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి రూ. 91.53 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, అదే సమయంలో 108.84 కోట్లను ఖర్చు చేసింది.

రెండు జాతీయ పార్టీలు, 10 ప్రాంతీయ పార్టీలు ఆదాయానికి మించి ఖర్చు చేశాయి. మిగతా 9 పార్టీలు ఆదాయం కంటే తక్కువే ఖర్చు చేశాయి. ఈసీ వెబ్‌సైట్‌లో టీఆర్ఎస్, వైసీపీలకు చెందిన ఆదాయ, వ్యయాల లెక్కలు కనిపించకపోవడం గమనార్హం. నిజానికి 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల లెక్కలను గతేడాది అక్టోబరు 31 నాటికే సమర్పించాలి. కానీ 19 పార్టీలు మాత్రమే ఈ లెక్కలను ఈసీకి అందించాయి.

గడువు తేదీ ముగిసిన 73 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది జనవరిలో తన లెక్కలు సమర్పించింది. గడువు ముగిసి 168 రోజులు దాటినప్పటికీ ఇంకా 41 పార్టీల ఆడిట్ రిపోర్టులు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కనిపించలేదు. ఆడిట్ రిపోర్టు సమర్పించని పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్‌సీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, వైసీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, ఆప్, ఆర్జేడీ సహా మరికొన్ని పార్టీలు ఉన్నాయి.

ఇక, ఖర్చులు పోను టీఎంసీ వద్ద రూ. 36 కోట్ల మిగులు కనిపించగా, బిజూ జనతాదళ్ ఆదాయం కంటే రూ. 95.78 కోట్లను అధికంగా ఖర్చు చేసింది. బీఎస్పీ కూడా రూ. 36 కోట్లను అధికంగా ఖర్చు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 19 పార్టీలు కలిపి సమర్పించిన మొత్తంలో టీడీపీ వాటా 14.78 శాతం కాగా, వ్యయంలో ఆ పార్టీ వాటా రూ. 16.26 శాతమని ఏడీఆర్ పేర్కొంది.

More Telugu News