కరోనా ఐసోలేషన్‌ కేంద్రాలుగా రైల్వే బోగీలు

18-04-2021 Sun 22:31
  • దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం
  • ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు
  • పడకలు సరిపోక ఇబ్బందులు
  • బోగీలను ఐసోలేషన్‌గా కేంద్రాలుగా మారుస్తున్న రైల్వేశాఖ
  • రాష్ట్రాలు కోరితే 3 లక్షల పడకలు అందించడానికి సిద్ధం
Railway coaches as covid isolation centres

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. కానీ, అందుకు అనుగుణంగా ఆసుపత్రుల్లో పడకలు లేవు. దీంతో అనేక రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు దాదాపు 4 వేల రైల్వే బోగీలను రైల్వే శాఖ ప్రత్యేక కొవిడ్‌ కేర్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వాటి ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం నిండుకుంటే ఆయా రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రైల్వే వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే శకూర్‌ బస్తీ స్టేషన్‌లో 800 పడకల సామర్థ్యం కలిగిన 50 బోగీలు, ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో మరో 25 బోగీలు అందుబాటులో ఉన్నాయని గోయల్ తెలిపారు. రాష్ట్రాలు కోరితే దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పడకల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.