మహిళా ఆటో డ్రైవర్ కు స్విఫ్ట్ కారు కానుకగా ఇచ్చిన సమంత

18-04-2021 Sun 20:37
  • కుటుంబం కోసం ఆటో నడుపుతున్న కవిత
  • కవిత స్వస్థలం సంగారెడ్డి జిల్లా
  • పదిమందిని పోషిస్తున్న కవిత
  • కవిత కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సమంత
Samantha gifts women auto driver Kavitha a swift car

ప్రముఖ హీరోయిన్ సమంత సినిమాలతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి అనేకమందికి చేయూతనిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత అనే మహిళా ఆటో డ్రైవర్ కష్టాన్ని గుర్తించిన సమంతా ఆమెకు ఓ స్విఫ్ట్ కారును కానుకగా అందించడం విశేషం.

కవిత కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది. తల్లిదండ్రులు సహా పది మందితో కూడిన కుటుంబాన్ని తన రెక్కల కష్టంతో పోషిస్తోంది. మగవాళ్లకే పరిమితం అని భావించే ఆటో డ్రైవింగ్ ను నేర్చుకుని, హైదరాబాదులోని మియాపూర్, పరిసర ప్రాంతాల్లో తిప్పుతోంది. కవిత కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సమంత, ఆమెకు కారును గిఫ్టుగా ఇచ్చారు. తద్వారా మరింత మెరుగైన ఉపాధికి బాటలు వేశారు.