కరోనా కట్టడికి ఎయిమ్స్‌ ఛీప్‌ గులేరియా చెప్పిన మూడు కీలక విషయాలు

18-04-2021 Sun 20:00
  • కంటైన్‌మెంట్ల జోన్ల ఏర్పాటుతో వ్యాప్తికి అడ్డుకట్ట
  • ప్రజలు గుమికూడకుండా ఉండాలి
  • వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
  • దేశాన్ని మళ్లీ జోన్లుగా విభజించాలి
AIIMS Chief Guleria Suggests 3 key solutions to contain corona

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ గులేరియా మూడు కీలక సూచనలు చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, ప్రజలు గుమికూడకుండా అడ్డుకోవడం, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి చర్యల ద్వారా మహమ్మారిని అదుపులోకి తీసుకురావొచ్చని ఎన్డీటీవీ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందని గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. గతంలో విభజించినట్లుగా కరోనా తీవ్రతను బట్టి రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లుగా విభజించాలని తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో మరిన్ని పడకలు, ఆక్సిజన్‌ పాయింట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  

100 ఏళ్ల క్రితం వచ్చిన మహమ్మారులను పరిశీలించినట్లయితే.. రెండో దఫా విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉండిందని గుర్తుచేశారు. ఇప్పటికీ ప్రజలు అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అందుకే కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఇక యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ విషయానికి వస్తే... కొవిడ్‌-19 చికిత్సలో దీని పాత్ర పరిమితమేనని తెలిపారు. ఇది కేవలం ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్యను తగ్గించవచ్చు కానీ, మరణాల రేటును మాత్రం తగ్గించలేదని తెలిపారు. ఇప్పటి వరకు కరోనాకు సమర్థమైన చికిత్స, ఔషధం లేదని తేల్చి చెప్పారు.