ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్... పరుగులు తీయనున్న 'ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్' రైళ్లు

18-04-2021 Sun 18:28
  • దేశంలో ఉద్ధృతంగా కరోనా సెకండ్ వేవ్
  • భారీగా ఆసుపత్రుల పాలవుతున్న జనం
  • నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు
  • కేంద్రానికి రాష్ట్రాల విజ్ఞప్తులు
  • రైల్వే శాఖను సంప్రదించిన కేంద్రం
  • ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ చేపట్టిన రైల్వేశాఖ
Oxygen Express trains will be run across nation

భారత్ లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రమాదకరం అని నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో, ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య నానాటికీ రెట్టింపవుతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల బెడ్ల కొరత, ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఆక్సిజన్ లభ్యత లేక కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రత్యేకంగా ప్రాణవాయువు తరలింపు కోసం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడపాలని కేంద్రం రైల్వే శాఖను కోరింది. ద్రవరూప ఆక్సిజన్ ను రైళ్ల ద్వారా తరలించే వెసులుబాటు ఉంటే వెంటనే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో రైల్వే శాఖ పలు మార్గాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో ట్రయల్ రన్ చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడపాలని నిర్ణయించారు.

ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలుగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో ఎలాంటి ఆటంకాలు, నిలుపుదలలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.