SRH: దటీజ్ ముంబై... మరోమారు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని సన్ రైజర్స్ పై విజయం!

MI Win Over SRH
  • టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై
  • కేవలం 150 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ సేన
  • ఛేదించలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్
  • బెయిర్ శుభారంభం వృథా

లక్ష్యం కేవలం 151 పరుగులు. బెయిర్ స్టో శుభారంభం ఇచ్చాడు కూడా. ఓ దశలో 76 బంతుల్లో చేయాల్సిన పరుగులు 84 మాత్రమే. అయినప్పటికీ, సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేక 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు ప్రస్తుత ఐపీఎల్ లో తొలిసారిగా టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ పిచ్ ని ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించిన ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ క్లిష్టతరమవుతుందని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆపై 151 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. రాహుల్ చాహార్ 3 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసి తమ జట్టు విజయానికి బాటలు వేశారు. బెయిర్ స్టో 22 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ వార్నర్ 34 బంతుల్లో 36, విజయ్ శంకర్ 25 బంతుల్లో 28 పరుగులు చేశారు. మరే ఆటగాడు కూడా రెండంకెల పరుగులను చేరలేకపోయారు. మనీశ్ పాండే 2, విరాట్ సింగ్ 11, శంకర్ 28, అభిషేక్ 7, రషీద్ ఖాన్ 0, భువనేశ్వర్ 1, ఖలీల్ అహ్మద్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. సన్ రైజర్స్ చివరి 7 వికెట్లూ 36 పరుగుల తేడాలోనే కోల్పోవడం గమనార్హం.

ఇక నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరుగనుండగా, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 6.30 నుంచి మ్యాచ్ జరుగనుంది.

  • Loading...

More Telugu News