Mamata Banerjee: మమతా బెనర్జీ ఆడియో లీక్ పై ఈసీకి లేఖ రాసిన తృణమూల్ కాంగ్రెస్

  • ఇటీవల కూచ్ బెహార్ లో భద్రతా బలగాల కాల్పులు
  • నలుగురు మృతి
  • మృతదేహాలతో ర్యాలీ చేయాలంటూ మమతా చెప్పినట్టు బీజేపీ ఆరోపణ
  • శవరాజకీయాలంటూ జేపీ నడ్డా విమర్శలు
  • ఇది బీజేపీ కుట్రేనన్న టీఎంసీ నేతలు
  • తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న మమతా బెనర్జీ
TMC wrote EC on Mamata audio leak

కూచ్ బెహార్ ఘటనలో ప్రాణాలు వదిలిన వ్యక్తుల మృతదేహాలతో ర్యాలీ చేయాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పార్థ ప్రతిమ్ రాయ్ కు సూచించినట్టుగా ఓ ఆడియో టేప్ లీకవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇది బీజేపీ కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఈ అంశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి.

బీజేపీనే ఈ ఆడియోను రికార్డు చేసి లీక్ చేసిందని తృణమూల్ నేతలు ఆరోపించారు. బీజేపీ ఆ ఆడియో క్లిప్ లోని కంటెంట్ ను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తోందని తమ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందుగా ఓ ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేయడం బీజేపీ చరిత్రలో తాము ఎన్నడూ చూడలేదని తృణమూల్ నేతలు యశ్వంత్ సిన్హా, డెరెక్ ఓబ్రియాన్, పూర్ణేందు బసు విమర్శించారు. సీఎం మమత ఫోన్ సంభాషణను అక్రమంగా, న్యాయవిరుద్ధంగా రికార్డు చేశారని, తద్వారా బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ యాక్ట్, ఐపీసీ ఉల్లంఘనలకు కూడా పాల్పడిందని ఆరోపించారు.

ఇటీవల కూచ్ బెహార్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, వారి మృతదేహాలతోనే ర్యాలీ చేయాలంటూ మమత పేర్కొన్నట్టు ఆ ఆడియో క్లిప్పింగ్ చెబుతోంది. దీనిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసం శవాలను పీక్కుతినే రాబందుల్లా మృతదేహాలతో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీఎంసీ నేతలపై మండిపడ్డారు.

అటు, పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 78.36 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో 45 స్థానాలకు పోలింగ్ చేపట్టారు. ఇక ఆరో విడత్ పోలింగ్ ఈ నెల 22న నిర్వహించనున్నారు.

More Telugu News