'పుష్ప'లో ట్విస్టుల మీద ట్విస్టులు!

17-04-2021 Sat 19:23
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
  • గిరిజన యువతిగా రష్మిక
  • అంచనాలు పెంచుతున్న విశేషాలు
Allu arjun and Rashmika Interesting Roles in Pushpa

అల్లు అర్జున్ కథానాయకుడిగా .. రష్మిక కథానాయికగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగు జరుపుకుంది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమరవాణా ప్రధానాంశంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ స్మగ్లింగ్ కి సంబంధించిన లారీని నడిపే డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే బన్నీ లారీ డ్రైవర్ గా ఆ గ్యాంగ్ లో చేరడం .. స్మగ్లర్ గా తన కార్యకలాపాలను నిర్వహించడం వెనుక ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మిక .. గిరిజన యువతిగా కనిపించనుంది. గిరిజన గూడెంలో ఉండే రష్మిక, ఇంటర్వెల్ కి ముందు విలన్ తరఫు మనిషిగా రివీల్ అవుతుందట. విలన్ కి సంబంధించిన ఎకౌంట్స్ ఆమె చూస్తూ ఉంటుందని అంటున్నారు. అయితే ఆమె విలన్ వైపు వెళ్లడం వెనుక ఒక ట్విస్ట్ ఉంటుందని చెబుతున్నారు. వేరు వేరు ఉద్దేశాలతో అడవిలో తారసపడిన హీరో హీరోయిన్లు ఏం చేస్తారనేది మరో ట్విస్ట్ అంటున్నారు. మొత్తానికి సుకుమార్ ఈ సినిమాను ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తున్నాడు. ఇక ఇది ఎన్ని రికార్డులను చెరిపేస్తుందో .. ఏ స్థాయిలో వసూళ్లను దులిపేస్తుందో చూడాలి.