ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్... టాస్ ఓడిన సన్ రైజర్స్

17-04-2021 Sat 19:21
  • ఇప్పటివరకు రెండు మ్యాచ్ లాడిన సన్ రైజర్స్
  • రెండింట్లోనూ ఓటమి
  • గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్న వార్నర్ సేన
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
Sunrisers lost toss against Mumbai Indians

ఐపీఎల్ 14వ సీజన్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడి, రెండింట్లోనూ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ముంబయి ఇండియన్స్ తో తలపడుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

టోర్నీలో అన్ని జట్లు గెలుపు రుచి చూసినా, ఇప్పటి వరకు ఆ అనుభూతికి దూరంగా ఉన్న జట్టు సన్ రైజర్స్ ఒక్కటే. అత్యంత పటిష్ఠమైన జట్టుగా పేరుగాంచిన ముంబయి ఇండియన్స్ తో తలపడనుండడం ఇవాళ్టి మ్యాచ్ లో సన్ రైజర్స్ కు ప్రతికూలాంశమే. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. విరాట్ సింగ్, ఖలీల్ అహ్మద్, అభిషేక్ శర్మ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లను తుది జట్టులోకి తీసుకువచ్చింది. వృద్ధిమాన్ సాహా, జాసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్, నటరాజన్ లను పక్కనబెట్టారు.

ముంబయి ఇండియన్స్ జట్టు ఈ పోరు కోసం ఒక మార్పు చేసింది. మార్కో జాన్సెన్ స్థానంలో ఆడమ్ మిల్నే ఆడనున్నాడు. ముంబయి జట్టు ఇప్పటిదాకా రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయం, ఒక ఓటమి నమోదు చేసింది.