హీరోగా ఎన్టీఆర్ .. నిర్మాతగా సుకుమార్!

17-04-2021 Sat 17:36
  • 'ఉప్పెన'తో సంచలన విజయం
  • ఎన్టీఆర్ తో తదుపరి చిత్రం
  • కొరటాల ప్రాజెక్టు తరువాత పట్టాలపైకి  
Sukumar as producer for NTR movie

తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదిగినప్పుడే తాను ఎదిగినట్టు .. అనే డైలాగ్ ఆ మధ్య ఓ సినిమాలో వినిపించింది. సుకుమార్ విషయంలో ఆ మాట నూటికి నూరుపాళ్లు వర్తిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఒక్కొక్కరికీ .. ఒకరి తరువాత ఒకరికి సుకుమార్ దర్శకుడిగా అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. అలా 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు, భారీ విజయాన్ని అందించాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ప్రేమకథలను దాటుకుని శిఖరంపై నిలిచిన ఈ సినిమా, వసూళ్ల హోరు ఎలా ఉంటుందో వినిపించింది.

బుచ్చిబాబు ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'నాన్నకు ప్రేమతో' సినిమా నుంచి ఎన్టీఆర్ కి .. సుకుమార్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సుకుమార్ దగ్గరుండి చూసుకుంటాడనే నమ్మకంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని భావించారు. ఈ సినిమాకి సుకుమార్ ఒక నిర్మాత కూడా అనేది తాజా సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో, సుకుమార్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక క్రీడాకారుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. కొరటాల ప్రాజెక్టు తరువాత ఎన్టీఆర్ చేసే మూవీ ఇదేనని అంటున్నారు.