వాట్సాప్ యూజర్లు జాగ్రత్త... సీఈఆర్టీ హెచ్చరిక

17-04-2021 Sat 17:32
  • వాట్సాప్ లో బగ్ లు గుర్తించినట్టు సీఈఆర్టీ వెల్లడి
  • వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ముప్పు ఉందని వివరణ
  • వాట్సాప్ బిజినెస్ యాప్ ఐఓఎస్ వెర్షన్లోనూ లోపం
  • లేటెస్ట్ వెర్షన్లు డౌన్ లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచన
CERT alerts Whatsapp users about a possible cyber attack

జాతీయ సైబర్ భద్రత సంస్థ సీఈఆర్టీ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక చేసింది. వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. వాట్సాప్ v2.21.4.18 వెర్షన్ లో లోపం ఉందని సీఈఆర్టీ వెల్లడించింది. దాంతో పాటే వాట్సాప్ బిజినెస్ యాప్ v2.21.32 ఐఓఎస్ వెర్షన్ కూడా లోపభూయిష్టంగా ఉందని వివరించింది.

ఈ వెర్షన్లను ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే వాట్సాప్ అప్ డేటెడ్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే, హ్యాకర్లు ఎక్కడ్నించైనా గానీ వాట్సాప్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలరని సీఈఆర్టీ పేర్కొంది. వాట్సాప్ కోడ్ లోని క్యాచే కాన్ఫిగరేషన్, ఆడియో డీకోడింగ్ విభాగాల్లో ఈ లోపాలను గుర్తించినట్టు తెలిపింది.