హిందీ 'అపరిచితుడు'లో కియారా అద్వానీ

17-04-2021 Sat 16:59
  • 'అపరిచితుడు'ని రీమేక్ చేస్తున్న శంకర్ 
  • హీరోగా నటిస్తున్న రణ్ వీర్ సింగ్
  • నాయిక పాత్రకు సంతకం చేసిన కియారా
  • మరోపక్క ఆస్కార్ రవిచంద్రన్ తో వివాదం    
Kiara Adwani in Hindi remake of Aparichitudu

 సుమారు పదిహేనేళ్ల క్రితం వచ్చిన అనువాద చిత్రం 'అపరిచితుడు' సినిమా ఒక సంచలనం. దర్శకుడు శంకర్ ఇమేజ్ ని ఈ చిత్రం ఎక్కడికో తీసుకుపోతే.. హీరో విక్రమ్ స్థాయిని మరింతగా పెంచేసింది. విక్రమ్ లోని అసలుసిసలు నటుడుని ఈ సినిమా ప్రేక్షకులకు రుచి చూపించింది. 'అన్నియన్'గా వచ్చిన తమిళ మాతృక అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డాక్టర్ జయంతి లాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఇందులో కథానాయిక పాత్రకు తాజాగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ఆమె కథ విని, ప్రాజక్టుకి సంతకం కూడా చేసినట్టు చెబుతున్నారు.

మరోపక్క, ఈ చిత్రంపై కొత్త వివాదం నెలకొంది. ఈ సినిమా రీమేక్ హక్కులు తనవేనని తమిళ వెర్షన్ ని నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఇటీవల ప్రకటన ఇచ్చారు. తన అనుమతి లేకుండా హిందీలో రీమేక్ చేయడం అన్యాయమని ఆయన వాదిస్తున్నారు. అయితే, దర్శకుడు శంకర్ మాత్రం మరోలా చెబుతున్నారు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే  తనకే చెందుతాయని ఆయన అంటున్నారు. చివరికి ఈ వివాదం కోర్టుకి వెళ్లేలా కనిపిస్తోంది.