నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్

17-04-2021 Sat 16:21
  • కొనసాగుతున్న సాగర్ ఉప ఎన్నిక పోలింగ్
  • సాయంత్రం అయ్యేకొద్దీ పెరుగుతున్న ఓటర్ల సంఖ్య
  • ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
  • సాయంత్రం 6 తర్వాత కొవిడ్ రోగులకు ఓటేసే అవకాశం
Nagarjunasagar polling continues

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు చేపట్టనున్నారు.

ఆపై, అప్పటివరకు క్యూలో ఉన్నవారితో పాటు, కొవిడ్ రోగులకు రాత్రి 7 గంటల వరకు ఓటేసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నంతో పోల్చితే సాయంత్రం అయ్యేకొద్దీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నారు. సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నాగార్జునసాగర్ బరిలో టీఆర్ఎస్ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ తరఫున జానారెడ్డి, బీజేపీ తరఫున పానుగోతు రవికుమార్ పోటీ చేస్తున్నారు.