Sajjala Ramakrishna Reddy: గత రెండు, మూడు రోజుల నుంచి చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు: సజ్జల వ్యంగ్యం

  • తిరుపతి లోక్ సభ స్థానానికి నేడు పోలింగ్
  • దొంగ ఓట్లు వేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపణ
  • బదులిచ్చిన సజ్జల
  • ప్రతిదీ కుట్రపూరితంగా ఆలోచిస్తాడని ఆగ్రహం
Sajjala fires on Chandrababu

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం ఊపందుకుంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తమపై అనవసరంగా దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గత రెండు, మూడు రోజుల నుంచి విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు.

ప్రతిదీ కుట్రపూరితంగా ఆలోచించడం చంద్రబాబు నైజం అని, తాను ఎలాంటి ముగింపు ఉండాలని కోరుకుంటాడో అందుకోసం అన్నిరకాల ప్రణాళికలు వేస్తాడని వెల్లడించారు. ఆనాడు తన మామ ఎన్టీఆర్ ను దింపడానికి ఏమేం విద్యలు ప్రదర్శించాడో, గత 40 ఏళ్లుగా ఆ విద్యలన్నింటికీ మరింత పదును పెట్టాడని సజ్జల వ్యాఖ్యానించారు. అప్పట్లో తాను యువ పాత్రికేయుడ్నని వెల్లడించిన సజ్జల... ఎన్టీఆర్ కు ఆవేశం తెప్పించి అసెంబ్లీ రద్దు చేసే పరిస్థితిని చంద్రబాబు కల్పించాడని వివరించారు. ఎమ్మెల్యేలందరూ కట్టకట్టుకుని తనవైపు వచ్చేలా దూరాలోచన చేసిన చంద్రబాబు... ఇప్పుడు తిరుపతి ఎన్నిక సందర్భంగా సాధారణ రీతిలో ఆలోచిస్తాడని తామనుకోలేదని స్పష్టం చేశారు.

తాము ప్రజలనే నమ్ముకున్నామని, ప్రజలు తమవైపే ఉన్నారన్నది ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల్లోనూ అది నిరూపితమైందని అన్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ శాతంపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయని వెల్లడించారు. సింగిల్ ఎన్నిక కాబట్టి ఓటర్లలో నిరాసక్తత రాకుండా వారిని ఉత్సాహపరిచేలా వైసీపీ ప్రచారం సాగిందని చెప్పారు. కానీ రెండు, మూడు రోజుల నుంచి టీడీపీ ప్రచార సరళి మారిందన్నారు. తిరుపతి బరిలో బయటి వ్యక్తులు వస్తారని ఆరోపణలు చేయడం ప్రారంభించారని తెలిపారు.

"తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పరిధిలో చంద్రబాబు మిగతా అసెంబ్లీ స్థానాలను వదిలేసి తిరుపతినే టార్గెట్ చేయడం వెనుక లోతైన కుట్ర ఉంది. తిరుపతికి దేశం నలుమూలల నుంచి వేలమంది భక్తులు వస్తుంటారు కాబట్టి వారిని దొంగ ఓటర్లుగా ముద్ర వేసే తంతుకు తెరదీశారు. తమకు అనుకూల మీడియా సాయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డికి తిరుపతిలో సొంత ఇల్లు ఉంది. నీలాగా కబ్జాలు చేసి కట్టుకోలేదు" అని మండిపడ్డారు.

"ఎక్కడైనా దొంగ ఓటర్లను బస్సులు పెట్టి తీసుకువస్తారా... అది నీకు అలవాటు తప్ప మరెవ్వరూ చేయరు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ ఎన్నిక నిర్వహిస్తోంది కేంద్రం... కేంద్ర బలగాలు, సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేస్తోంది. ఇన్ని ఉండగా, ఇవన్నీ దాటుకుని దొంగ ఓట్లు ఎవరు వేయిస్తారంటే... డిపాజిట్లు కూడా రావని భావించే టీడీపీ కానీ, దాంతో పోటీ పడే బీజేపీ కానీ చేయాలి" అని అభిప్రాయపడ్డారు.

More Telugu News