తిరుపతి బరిలో దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి... వీడియో ఇదిగో!

17-04-2021 Sat 14:43
  • తిరుపతి పార్లమెంటు స్థానానికి నేడు ఉప ఎన్నిక
  • కొనసాగుతున్న పోలింగ్
  • ఓ పోలింగ్ బూత్ ను సందర్శించిన పనబాక
  • దొంగ ఓటర్లను గుర్తించిన వైనం
  • గేట్లు మూసి అందరినీ పట్టుకున్న పోలీసులు
TDP candidate Panabaka Lakshmi handed over fradulant voters to police

దేశవ్యాప్తంగా ఇవాళ పలు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానంలోనూ పోలింగ్ జరుగుతోంది. అయితే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా పలువురు దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ దొంగ ఓట్లు వేస్తున్న సంగతి గ్రహించారు. దొంగ ఓటర్లను గుర్తించిన ఆమె అక్కడున్న పోలీసులను అప్రమత్తం చేశారు.

పనబాక లక్ష్మి తమను గుర్తించడంతో దొంగ ఓటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు వారిని దొరకబుచ్చుకున్నారు. పోలింగ్ కేంద్రం గేట్లు వేయించి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని ఓ వాహనంలో సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ న్యూస్ చానల్ పంచుకుంది.