కుంభమేళా భక్తులు.. కరోనాను ప్రసాదంలా పంచిపెడతారు: ముంబై మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

17-04-2021 Sat 14:11
  • వారిని వారి ఖర్చులతోనే క్వారంటైన్ చేయాలి
  • 5% మందే కరోనా నిబంధనలు పాటించట్లేదని వెల్లడి
  • ముంబైలో పూర్తి లాక్ డౌన్ పెట్టాలని కామెంట్
Mumbai Mayor Controversy Comments On Kumbh Mela Devotees

కుంభమేళాపై ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చే భక్తులంతా కరోనాను ‘ప్రసాదం’లా పంచిపెడతారని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల్లోనూ కుంభమేళా భక్తులను క్వారంటైన్ చేయాలని ఆమె సూచించారు. ఆ ఖర్చులనూ వారే భరించేలా చేయాలన్నారు.

‘‘ఎవరైనా కుంభమేళా నుంచి వారి వారి రాష్ట్రాలు, సొంతూర్లకు వెళతారో.. వారంతా కరోనాను ప్రసాదంలాగా పంచిపెడతారు. ముంబైకి తిరిగి వచ్చిన కుంభమేళా భక్తులందరినీ వారి ఖర్చులతోనే క్వారంటైన్ లో పెడతాం’’ అని అన్నారు.

అంతేగాకుండా చిన్న చిన్న ఆంక్షలు పెడితే సరిపోవని, కరోనాను కట్టడి చేయాలంటే ముంబైలో పూర్తి లాక్ డౌన్ పెట్టాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయన్నారు. 95 శాతం ముంబై జనాలు కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారని, పాటించని మిగతా ఆ ఐదు శాతం మందితోనే కరోనా విజృంభిస్తోందని చెప్పారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 వరకు అది కొనసాగనుంది.