Bihar: లాలూ ప్రసాద్​ యాదవ్​ కు బెయిల్​ మంజూరు

  • దాణా కుంభకోణంలో జైలులో బీహార్ మాజీ సీఎం
  • అనారోగ్యంతో కొన్నాళ్లుగా ఎయిమ్స్ లో చికిత్స
  • జైలు శిక్ష సింహభాగం ఆసుపత్రుల్లోనే గడిపిన లాలూ
Lalu Gets bail in Fodder scam

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. దాణా కుంభకోణంలో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఈరోజు ఝార్ఖండ్ హైకోర్టు ఊరటనిస్తూ బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి విడుదలైన నిధుల్లో రూ.3.13 కోట్లు కాజేశారన్న ఆరోపణల కేసులో ఆయన్ను కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది.

2017 డిసెంబర్ నుంచి ఆయన జైలులోనే గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జైలు కన్నా ఆసుపత్రుల్లోనే ఆయన ఎక్కువగా గడుపుతున్నారు. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఎయిమ్స్ కు ఆయన్ను తరలించారు.

కాగా, దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో ఇప్పటికే మూడింటికి ఆయనకు బెయిల్ లభించింది. తాజాగా ‘దుమ్కా ట్రెజరీ’ కేసుకు సంబంధించీ బెయిల్ పొందారు. నాలుగు కేసుల్లోనూ బెయిల్ పొందడంతో.. ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేసిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.

More Telugu News