వీరందరూ తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్తున్నారని పొరపాటు పడకండి.. దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తున్నారు: వీడియో పోస్ట్ చేసిన విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

17-04-2021 Sat 13:11
  • వైసీపీ ఏం సాధించాల‌ని అనుకుంటోంది?
  • దొంగ ఓట్ల‌తో గెల‌వాల‌నుకోవ‌డం ఏంటి?
  • పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు చేతులు ఎత్తేశారు
  • అప్ర‌జాస్వామిక విధానంలో ఎన్నికలు జ‌రుగుతున్నాయి
Vishnu Reddy slams ycp

తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల‌పై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న మాట్లాడుతూ... కొత్తరకం ఓటు బ్యాంకు రాజ‌కీయాలు, దౌర్జ‌న్యాల‌కు వైసీపీ తెర‌లేపింద‌ని వ్యాఖ్యానించారు. ఉద‌యం 7 గంట‌ల‌ నుంచి ఇత‌ర ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చార‌ని తెలిపారు.

ఇటువంటి రాజ‌కీయాలతో వైసీపీ ఏం సాధించాల‌ని అనుకుంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తూ దొంగ ఓట్ల‌తో గెల‌వాల‌నుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. నిజ‌మైన‌ ఓట‌ర్ల‌ను ఓటు హ‌క్కు స‌ద్వినియోగం చేసుకోనివ్వ‌కుండా చేయ‌డం స‌రికాద‌ని చెప్పారు.

మ‌రోప‌క్క పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు చేతులు ఎత్తేయ‌డం, దేశంలో ఎక్క‌డా లేనివిధంగా అప్ర‌జాస్వామిక విధానంలో ఎన్నిక జ‌రుగుతుండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. రాష్ట్ర పోలీసులు, ఎన్నిక‌ల సిబ్బందిపై, దొంగ ఓట్లు వేసిన వారిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌మ పార్టీ డిమాండ్ చేస్తోంద‌ని తెలిపారు.  

'వీరందరూ తిరుమల దర్శనానికో.. కాళహస్తి దేవుడి దర్శనానికో వెళ్తున్నారని పొరపాటు పడకండి. తిరుపతి ఉప ఎన్నికలో మంత్రులు, ఎమ్మెల్యేల అధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రైవేట్ కళాశాల బస్సులలో, ఇత‌ర‌ ప్రైవేట్ బస్సులలో వీరందరినీ  తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారు' అని ఆయ‌న ఓ వీడియో పోస్ట్ చేశారు.