Prime Minister: వివేక్​ మరణం ఎంతో మందిని శోకంలో ముంచింది.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

  • ఆయన హాస్యం ఎంతో మందిని అలరించిందని కామెంట్
  • పర్యావరణం, సమాజంపై ఎంతో ప్రేమ అన్న ప్రధాని
  • తమిళుల గుండెల్లో స్థానం పదిలమన్న సీఎం పళనిస్వామి
  • ప్రకృతి ఎందుకు అంత త్వరగా తీసుకెళ్లిందో అంటూ స్టాలిన్ నిర్వేదం
PM Narendra Modi condoles death of actor Vivekh

తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చేరిన వివేక్.. శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. వివేక్ హఠాన్మరణం ఎందరినో శోకసంద్రంలో ముంచిందని మోదీ పేర్కొన్నారు.

‘‘సమయానుసారంగా ఆయన పండించే హాస్యం, డైలాగ్ చాతుర్యం కొన్ని కోట్ల మందిని అలరించాయి. పర్యావరణం, సమాజంపై ఆయనకున్న ప్రేమ ఇటు సినిమాల్లోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ కనిపించేది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆయన్ను ఆరాధించేవారికి సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.  

వివేక్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ఆయన లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ఆయన నటన, సామాజిక సేవ చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. తమిళ ప్రజల గుండెల్లో వివేక్ స్థానం పదిలంగా ఉంటుందన్నారు.

వివేక్ మరణం షాక్ కు గురిచేసిందని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. తన నటన, హాస్యంతో ప్రజలకు ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించారన్నారు. కళైనార్ తో వివేక్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రకృతి అంటే ప్రేమించే వివేక్ ను.. ప్రకృతి అంత త్వరగా ఎందుకు తీసుకెళ్లిందో అంటూ విచారం వ్యక్తం చేశారు.

More Telugu News