'మహాసముద్రం' నుంచి సిద్ధార్థ్ ఫస్టులుక్!

17-04-2021 Sat 12:11
  • మల్టీస్టారర్ గా 'మహాసముద్రం'
  • చాలా గ్యాప్ తరువాత తెలుగు తెరపై సిద్ధార్థ్
  • కథానాయికలుగా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్
Siddharth first look from Mahasamudram
అజయ్ భూపతి పేరు వినగానే 'ఆర్ ఎక్స్ 100' సినిమా గుర్తుకు వస్తుంది. అంతగా ఆ సినిమా యూత్ హృదయాలను పట్టేసింది. ఆ తరువాత ఆయన 'మహాసముద్రం' కథను తయారు చేసుకుని చాలామంది హీరోలకు వినిపించాడు.

చివరికి శర్వానంద్ - సిద్ధార్థ్ ను సెట్ చేసుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా అదితీరావు .. మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి, రీసెంట్ గా అదితీరావు ఫస్టులుక్ ను వదిలారు.

ఇక ఈ రోజున సిద్ధార్థ్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫస్టులుక్ ను వదిలారు. సిద్ధార్థ్ తనదైన స్టైల్లోనే కనిపిస్తున్నాడు. కొంతకాలం క్రితం సిద్ధార్థ్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక్కడి యువ హీరోలతో పోటీపడి మరీ ఆయన హిట్లు కొట్టాడు. ఆ తరువాత పరాజయాల చేతికి చిక్కి తమిళ సినిమాలకే పరిమితమయ్యాడు. మళ్లీ ఇప్పుడు 'మహాసముద్రం'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఇక్కడ పుంజుకుంటాడేమో చూడాలి. ఇక 'శ్రీకారం' ఫ్లాప్ తో డీలాపడిపోయిన శర్వానంద్ ను కూడా ఈ సినిమానే గట్టెక్కించాలి.