తలనొప్పి, ఒంటి నొప్పులు, కళ్లు ఎర్రబారడం.. కొవిడ్​ కొత్త లక్షణాలు!

17-04-2021 Sat 11:49
  • ఏపీలోని మూడు జిల్లాల్లో కేసుల పరిశీలన
  • ఈ లక్షణాలున్న వారికీ పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ
  • ఈ లక్షణాలుంటే ఉపేక్షించొద్దని ప్రజలకు సూచన
  • రెండు మూడు రోజులకే బయటపడుతున్న లక్షణాలు
Covid New symptoms include Headache and Body pains

దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు.. ఇవి ఇప్పటిదాకా చాలా మందిలో కనిపిస్తున్న కొవిడ్ లక్షణాలు. అవి ఉన్నట్టనిపిస్తే పరుగుపరుగున కరోనా టెస్టుకు వెళ్తున్నాం. అయితే, తలనొప్పి వచ్చినా, ఒంటి నొప్పులున్నా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, అవీ కరోనా లక్షణాలు అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఏపీలోని మూడు జిల్లాల్లోని కేసులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు.

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో నమోదైన కేసులను పరిశీలించగా ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపించాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్య నిపుణుల కమిటీ ముఖ్య ప్రతినిధి డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. తల, ఒంటి నొప్పులతో పాటు కీళ్ల నొప్పులున్న వారిలోనూ కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయన్నారు. కళ్ల నుంచి కూడా కరోనా వ్యాపిస్తోందని వైద్యులు నిర్ధారించారు. అలాంటి వారిలో కళ్లు ఎర్రబారుతున్నాయని గుర్తించారు. కాబట్టి ఈ తరహా లక్షణాలున్నా ఉపేక్షించకుండా వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

లక్షణాలు కూడా వెంటనే బయటకు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో లక్షణాలు కనిపించేందుకు వారం రోజులు పడితే.. ఇప్పుడు రెండు మూడురోజులకే బయటపడుతున్నాయని అంటున్నారు. ఈసారి యువతపైనే కరోనా మహమ్మారి పంజా విసురుతోందని, బాధితుల్లో వారే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు. వస్తున్న కేసుల్లో పావు వంతు బాధితులు వారేనంటున్నారు.

మాస్కులు పెట్టుకోకపోవడం, కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే అందుకు కారణమంటున్నారు. సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి ఎవరికివారు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు.