అమెరికాలో మాజీ పోలీస్​ కాల్పులు.. నలుగురు భారతీయులు సహా 8 మంది మృతి

17-04-2021 Sat 11:27
 • ఇండియానాపొలిస్ లోని ఫెడెక్స్ వద్ద ఘటన
 • తనను తాను కాల్చుకుని చనిపోయిన నిందితుడు
 • మరణించిన భారతీయులంతా సిక్కులే
 • ధ్రువీకరించిన అక్కడి సిక్కు సంఘం
 • దిగ్ర్భాంతికి గురైన అధ్యక్షుడు జో బైడెన్ 
4 Indians Died In US Shooting in Indianapolis

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. 8 మందిని బలి తీసుకుంది. అందులో నలుగురు భారతీయులున్నారు. ఇండియానాపొలిస్ లో 19 ఏళ్ల ఓ మాజీ పోలీస్ నిన్న రాత్రి ఫెడెక్స్ ఆఫీస్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రాండన్ స్కాట్ హోల్ గా పోలీసులు గుర్తించారు. అతడు కాల్పులు జరపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఫెడెక్స్ ఫెసిలిటీ వద్ద బ్రాండన్ ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరిపాడని, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని ఇండియానా పొలిస్ డిప్యూటీ పోలీస్ చీఫ్ క్రెయిగ్ మెక్ కార్ట్ చెప్పారు. అతడు గత ఏడాది వరకు ఇండియానాపొలిస్ పోలీస్ విభాగంలో పనిచేశాడని చెప్పారు. కాల్పుల్లో ఫెడెక్స్ బయట నలుగురు, ఫెడెక్స్ ఆఫీస్ లోపల నలుగురు మరణించారని, చాలా మంది గాయపడ్డారని వివరించారు.

మరణించిన వారి వివరాలను ఇండియానాపొలిస్ పోలీసులు వెల్లడించారు. 8 మందిలో నలుగురు సిక్కులున్నారు. ఈ విషయాన్ని అక్కడి సిక్కు సంఘం ధ్రువీకరించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. కాగా, కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, విలువైన ప్రాణాలను కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు.

చనిపోయిన వారు వీరే...

 • అమర్ జీత్ జోహాల్ (66)
 • జస్వీందర్ కౌర్ (64)
 • అమర్ జీత్ షెఖాన్ (48)
 • జస్వీందర్ సింగ్ (68)
 • కార్లి స్మిత్ (19)
 • సమారియా బ్లాక్ వెల్ (19)
 • మాథ్యూ ఆర్. అలెగ్జాండర్ (32)
 • జాన్ వైసర్ట్ (74)