క‌రోనా వేళ ల‌క్ష‌లాది మందితో కుంభమేళా నిర్వ‌హ‌ణ‌పై మోదీ స్పంద‌న‌!

17-04-2021 Sat 11:23
  • ఇప్ప‌టికే రెండు రాజ స్నానాలు పూర్తయ్యాయి
  • కుంభమేళాను లాంఛనప్రాయంగానే జరపాలి
  • భ‌క్తులు లేకుండా చూడాలి
  • స్వామి అవధేశానంద్‌ గిరిని కోరాను
modi on kumbhamela

ఉత్త‌రాఖండ్‌లోని హరిద్వార్‌లో కొన‌సాగుతోన్న‌ కుంభమేళాపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఓ వైపు క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా ఉంటే, మ‌రోవైపు ఎటువంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండా ల‌క్ష‌లాది మంది కుంభ‌మేళాకు హాజ‌ర‌వుతుండ‌డంతో ఇప్ప‌టికే అనేక మంది సాధువుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. రెండు రాజ స్నానాలు పూర్తయ్యాయని, దీంతో ఇప్పుడున్న కరోనా విప‌త్క‌ర‌ పరిస్థితుల్లో కుంభమేళాను లాంఛనప్రాయంగానే జరపాలని, భ‌క్తులు లేకుండా చూడాల‌ని స్వామి అవధేశానంద్‌ గిరిని తాను కోరిన‌ట్లు చెప్పారు.ఈ నిర్ణయం క‌రోనాపై పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు.

కాగా, జునా అఖాడాహెడ్‌ స్వామి అవధేశానంద్‌ గిరితో మోదీ  ఫోనులో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సాధువుల ఆరోగ్యంపై కూడా ఆరా తీశారు. అనారోగ్యం ‌పాలైన‌ వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని తెలిపారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇప్ప‌టికే  అనేక ఆల‌యాల్లో భ‌క్తుల సంద‌ర్శ‌నాల‌ను నిలిపివేసిన విష‌యం తెలిసిందే.