వివేక్ తో గడిపిన క్షణాలను మర్చిపోలేను: రజనీకాంత్

17-04-2021 Sat 11:21
  • కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిన వివేక్
  • ప్రగాఢ సానుభూతిని తెలిపిన రజనీకాంత్
  • ఈ వార్తను నమ్మలేకపోతున్నానన్న రెహ్మాన్
Can not forget the days spent with Vivek says Rajinikanth

ప్రముఖ సినీ హాస్యనటుడు వివేక్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది. 59 ఏళ్ల వివేక్ కార్డియాక్ అరెస్ట్ కు గురై మృతి చెందారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ... తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని చెప్పారు. ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. 'శివాజీ' సినిమా షూటింగ్ సమయంలో ప్రతి రోజు ఆయనతో సమయాన్ని గడిపానని.. తన జీవితంలో ఆ రోజులను మర్చిపోలేనని చెప్పారు. వివేక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ... ''వివేక్.. నీవు మమ్మల్ని విడిచి పోయావనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. దశాబ్దాల పాటు మమ్మల్ని ఎంటర్ టైన్ చేశావు. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి' అని తెలిపారు.

ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. 'డియర్ ఫ్రెండ్ చాలా త్వరగా వెళ్లిపోయావు. మొక్కలతో పాటు మాలో ఆలోచనలను కూడా నాటినందుకు ధన్యవాదాలు. మాలో చైతన్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు. మిస్ యూ' అని ట్వీట్ చేశారు.