'వీరమల్లు' షూటింగును వారం క్రితమే ఆపేశారట!

17-04-2021 Sat 10:50
  • చారిత్రక నేపథ్యంలో క్రిష్ మూవీ
  • బందిపోటు 'వీరమల్లు' పాత్రలో పవన్
  • పవన్ కోలుకున్నాకే షూటింగ్
Hari Hara Veera Mallu shooting stoped due to corona

చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ చాలా సమర్ధుడు. ఆయన రూపొందించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి'    .. 'మణికర్ణిక' సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. ఈసారి కూడా ఆయన చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక అంశాన్ని కథావస్తువుగా ఎంచుకున్నాడు.

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాకి, 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ను సెట్ చేశారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. ఒక బందిపోటుగా పవన్ .. లుక్ పరంగా అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ సందడి చేయనుంది.

క్రిష్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన దగ్గర నుంచి చకచకా షూటింగు కానిచ్చేస్తున్నాడు. అలాంటి సినిమా షూటింగు వారం రోజుల క్రితమే ఆగిపోయిందట. పవన్ కల్యాణ్ లో కరోనా లక్షణాలు కనిపించగానే షూటింగును ఆపేసినట్టు చెప్పుకుంటున్నారు. పవన్ కి కరోనా పాజిటివ్ అనే వార్త బయటికి వచ్చిన తరువాతనే, షూటింగు ఆపేసిన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ పూర్తిగా కోలుకున్న తరువాతనే తిరిగి షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు. ఇక 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూటింగ్ కూడా కొంత ఆలస్యంగానే మొదలు కానుందట.