54 ఏళ్ల వయసులోనూ తగ్గని మైక్ టైసన్ పవర్ పంచ్!

17-04-2021 Sat 09:28
  • ‘ఏఈడబ్ల్యూ డైనమైట్’ రెజ్లింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న టైసన్
  • తనపైకి దూసుకొచ్చిన క్యాష్ వీలర్ ముఖంపై పిడిగుద్దు
  • గింగిరాలు తిరిగి కిందపడిన వీలర్
Mike Tyson lands a knock out punch in AEW wrestling appearance

మైక్ టైసన్.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరిది. తిరుగులేని బాక్సింగ్ చాంపియన్‌గా ఖ్యాతిగాంచిన టైసన్ ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అతడు మళ్లీ రింగ్‌లోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. 54 ఏళ్ల వయసున్న టైసన్‌లో మునుపటి వాడీవేడి తగ్గలేదని చెప్పే ఘటన ఒకటి తాజాగా జరిగింది.

‘ఏఈడబ్ల్యూ డైనమైట్’ రెజ్లింగ్ ఈవెంట్‌లో భాగంగా క్రిస్ జెరిచో, డాక్ హర్‌వుడ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే, వీరు ఎలాంటి ఆయుధాలు వాడకుండా చూడాల్సిన బాధ్యత టైసన్‌దే. ఈ నేపథ్యంలో అతడు రింగ్‌లోకి వచ్చాడు. అదే సమయంలో బేస్‌బాల్ బ్యాట్‌తో తనపైకి దూసుకొచ్చిన క్యాష్ వీలర్‌ను చూసి అప్రమత్తమైన టైసన్ పిడికిలి బిగించి మోచేతితో వీలర్ ముఖంపై ఒకే ఒక్క పంచ్ ఇచ్చాడు. అంతే.. ఆ దెబ్బకు గింగిరాలు తిరిగిన వీలర్ కిందపడ్డాడు. ఆ తర్వాత చాలాసేపటి వరకు అతడు కోలుకోలేదు.