ఇండియాలో రెమ్ డెసివిర్ ఎక్కడ దొరుకుతుంది... చెక్ చేయండిలా!

17-04-2021 Sat 08:59
  • ఇండియాలో పెరుగుతున్న కేసులు
  • తమ వద్ద యాంటీ వైరల్ డ్రగ్ లేదంటున్న రాష్ట్రాలు
  • ఉత్పత్తిని పెంచుతామన్న డాక్టర్ రెడ్డీస్
This is the Answer for Where We Can Find Remdisivir

భారతావనిలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీ అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో ఇండియా ఇప్పుడు తొలి స్థానంలో ఉంది. వైరస్ సోకిన వారికి అత్యవసరమైన ఔషధంగా పేరున్న రెమ్ డెసివిర్ కొరత ఇప్పుడు అధికంగా ఉంది. చాలా రాష్ట్రాలు తమ వద్ద ఈ మందు లేదని చెబుతున్నాయి. తక్షణమే పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం కూడా ఔషధ సంస్థలను ఆదేశించింది.

ఇక, కరోనా వైరస్ సోకి, ఆసుపత్రులు లేదా హోమ్ ఐసొలేషన్ లో ఉన్న వారు ఈ డ్రగ్ ను ఎక్కడ పొందవచ్చు? ఇండియాలో లక్షలాది మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఇందుకు సమాధానం ఉంది. భారత్ లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ డ్రగ్ ను అత్యధికంగా తయారు చేస్తోంది. ఈ డ్రగ్ సరఫరా ఏ ప్రాంతంలో అధికంగా ఉందన్న విషయంతో పాటు, ఎక్కడ అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.

దీని ప్రకారం, ఏఏ ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ అందుబాటులో ఉంది? ఏఏ నగరాల్లోని ఏ ఫార్మా షాపుల్లో దొరుకుతుంది? అన్న విషయాన్ని ఆయా ఆసుపత్రులు, ఫార్మాల చిరునామాలు, ఫోన్ నంబర్లతో సహా "readytofightcovid.in" వెబ్ సైట్ లో పొందుపరిచింది. దీంతో పాటు అనుక్షణం పనిచేసేలా 1800-366-708 అనే హెల్ప్ లైన్ నంబర్ నూ ఏర్పాటు చేసింది.

ఇందులో స్థానిక డిస్ట్రిబ్యూటర్ల వివరాలతో పాటు ప్రతి విషయాన్నీ తెలుసుకోవచ్చని, తాము సైతం ఈ డ్రగ్ ఉత్పత్తిని పెంచామని ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. కాగా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు తమ వద్ద రెమ్ డెసివిర్ నిల్వలు లేవని, తక్షణం పంపాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఔషధాన్ని అత్యంత తీవ్రమైన కరోనా కేసుల్లో మాత్రమే వాడాలని, స్వల్ప లేదా సాధారణ లక్షణాలున్న వారికి ఇవ్వవద్దని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.