పతాకస్థాయికి చేరిన రాజకీయ పార్టీల ప్రలోభాలు.. ఐదు రాష్ట్రాల్లో రూ. 1000 కోట్ల జప్తు

17-04-2021 Sat 08:58
  • 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది నాలుగు రెట్ల అధికం
  • అత్యధికంగా తమిళనాడులో రూ. రూ. 446.28 కోట్ల జప్తు
  • పట్టుబడిన వాటిలో మద్యం, నగదు, డ్రగ్స్, ఆభరణాలు
election commission seize Rs 1000 crores amid 5 states elections

ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం సర్వసాధారణమే అయినా ఈసారి అది పతాకస్థాయికి చేరుకుందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే పర్వం మరింత ఎక్కువైందని పేర్కొంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని వివరించింది.

 పశ్చిమ బెంగాల్‌లో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తే, అసోంలో మద్యం, తమిళనాడులో నగదును ఆయా పార్టీలు పంచిపెట్టాయని పేర్కొంది. ఎన్నికల సందర్భంగా ఈ ఐదు రాష్ట్రాల్లో రూ. 1000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. 2016 నాటి ఎన్నికలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువని వివరించింది.

అప్పటి ఎన్నికల్లో రూ. 225.77 కోట్లు సీజ్ చేసినట్టు తెలిపింది. తాజాగా పట్టుబడిన సొమ్ములో తమిళనాడుదే అగ్రభాగమని, అక్కడ ఏకంగా రూ. 446.28 కోట్లను జప్తు చేసినట్టు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (రూ. 300.11 కోట్లు), అసోం (రూ.122.35 కోట్లు), కేరళ రూ. (రూ. 84.91 కోట్లు), పుదుచ్చేరి (రూ. 36.95 కోట్లు) ఉన్నాయని, ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో రూ.10.84 కోట్లను సీజ్ చేసినట్టు ఈసీ తెలిపింది. స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు, మద్యం, ఆభరణాలు, డ్రగ్స్ ఉన్నట్టు వివరించింది.