ఇండియాలో పుట్టిన కొత్త కరోనా వేరియంట్... మరింత ప్రమాదకరమన్న బ్రిటన్!

17-04-2021 Sat 08:27
  • ఇండియాలో డబుల్ మ్యూటెంట్ వైరస్ 'బీ1617' 
  • 484క్యూ, ఎల్452ఆర్, పీ681ఆర్ వేరియంట్ల కలయిక ఇది 
  • బ్రిటన్ కు కూడా ఇది వ్యాపించింది
  • ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఇండియాకు వెళ్లద్దన్న అధికారులు 
New Corona Varient in India is Most Dangerous Says UK

ఇండియాలో కరోనా వైరస్ డబుల్ మ్యూటెంట్ చెంది మరింత ప్రమాదకరంగా మారిందని పేర్కొన్న బ్రిటన్ ఉన్నతాధికారులు, ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకోవాలని సూచించడం కలకలం రేపింది. ఇండియాలో పుట్టిన కొత్త వేరియంట్ బ్రిటన్ కు కూడా వ్యాపించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ ను తొలిసారిగా ఇండియాలోనే కనుక్కున్నారని పేర్కొన్న అధికారులు, దీనికి బీ1617 అని నామకరణం చేశామని, దీన్ని మరింతగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఈ కొత్త వైరస్ విషయంలో ఎపిడెమాలజిక్, ఇమ్యునోలాజికల్, పాథోజెనిక్ విభాగాలు విచారిస్తున్నాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) పేర్కొంది. ఏప్రిల్ 14 నుంచి ఇంగ్లండ్ లో 77 భారత్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయని, స్కాట్లాండ్ లో సైతం కనిపించిందని అధికారులు వెల్లడించారు.

"ఈ వేరియంట్ తొలిసారిగా ఇండియాలోనే కనిపించింది. 484క్యూ, ఎల్452ఆర్, పీ681ఆర్ తదితర వేరియంట్ల కలయికగా ఇది ఏర్పడింది. ఈ వైరస్ నియంత్రణకై కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో పరిస్థితిని సమీక్షిస్తున్నాం" అని పీహెచ్ఈ పేర్కొంది.

కాగా, వీటిల్లో ఓ వేరియంట్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో వెలుగులోకి రాగా, మరో వేరియంట్ సౌతాఫ్రికా, బ్రెజిల్ లో కనిపించింది. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఇండియాలో సమ్మిళితమై ప్రపంచానికి వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇండియాలో ఇప్పుడు మిగతా దేశాల కన్నా అత్యధికంగా 2 లక్షలకు పైగా కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయని గుర్తు చేసిన పీహెచ్ఈ, ఈ వైరస్ వ్యాప్తిని తక్షణం అరికట్టాల్సి వుందని అభిప్రాయపడ్డారు.