తెలంగాణలో జనసేన సహా... కామన్ సింబల్ ను కోల్పోయిన పలు పార్టీలు!

17-04-2021 Sat 06:52
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10 శాతం స్థానాల్లో పోటీ చేయని జనసేన
  • కామన్ గుర్తు ఇవ్వలేమని స్పష్టం చేసిన ఎస్ఈసీ అశోక్ కుమార్
  • 2025 వరకూ ఇవ్వలేమని స్పష్టీకరణ
Telangana SEC Clarification Over Janasena Common Symbol

తెలంగాణలో మినీ పురపోరుకు నగారా మోగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమకు కామన్ గుర్తులను కేటాయించాలని జనసేన సహా పలు పార్టీలు కోరగా, ఎన్నికల కమిషన్ నిరాకరించింది.

జనసేన (గాజు గ్లాసు), ఎంసీపీఐ (యూ) (గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) పార్టీల అభ్యర్థులకు కామన్ గుర్తు కేటాయించలేమని ఎస్ఈసీ ఎం. అశోక్ కుమార్ స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కనీసం 10 శాతం స్థానాలకు ఈ పార్టీలు పోటీ చేయలేదని, దీంతోనే కామన్ సింబల్ అవకాశాన్ని ఈ పార్టీలు కోల్పోయాయని అశోక్ కుమార్ తెలిపారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నామని, ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వరాదనే పోటీ నుంచి వెనక్కు తగ్గామని ఎస్ఈసీకి పంపిన లేఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు.

త్వరలో జరగనున్న కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, తమ అభ్యర్థులకు గాజు గ్లాసును గుర్తుగా ఇవ్వాలని ఆయన కోరారు. జనసేన విజ్ఞప్తిని పరిశీలించామని స్పష్టం చేసిన ఎస్ఈసీ, ఈ వినతిపత్రంలోని అంశాలు సంతృప్తిని కలిగించలేదని, అందువల్లే తిరస్కరించామని పేర్కొన్నారు. ఇదే సమయంలో 2025 నవంబర్ వరకూ జనసేన, ఇతర పార్టీలు ఒకే సింబల్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హతను కూడా కోల్పోయాయని ఆయన వెల్లడించారు.