పవన్ కల్యాణ్‌కు కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

17-04-2021 Sat 06:49
  • పవన్ కల్యాణ్‌కు కరోనాపై రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లు
  • వకీల్ సాబ్ వసూళ్లే పవన్‌ను ఈ స్థితికి గురిచేశాయంటూ సెటైర్
  • వేరే హీరోల ఫ్యాన్స్ అంటున్నారని వ్యాఖ్య
  • ఫ్యాన్స్ అందరూ కలిసి పీకే జేబులు నింపాలన్న వర్మ
RGV Shocking Comments on Pawan kalyan corona

గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న పవన్ కల్యాణ్‌కు కరోనా సోకినట్టు నిన్న నిర్ధారణ అయింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఇటు చిత్రపరిశ్రమ నుంచి అటు రాజకీయ నాయకుల నుంచి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. అందరూ ఆయన కోలుకోవాలని ట్వీట్లు చేస్తుంటే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం వరుస ట్వీట్లతో షాకింగ్ కామెంట్ చేశాడు.

ఒక కనిపించని పురుగు పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయస్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువరానర్? అని ప్రశ్నించిన వర్మ, మరో ట్వీట్‌లో.. వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇలా మంచాన పడడానికి కారణం కొవిడ్ కాదని, వకీల్ సాబ్ వసూళ్లు అని అంటున్నారని, అందరూ కదిలి ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశాడు.

సోషల్ మీడియాలో విడుదలైన పవన్ విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలో వున్న 'ఫేక్' ఏమిటో చెప్పాలని, ఆ తప్పును బయటపెట్టిన వారి ఫొటోను తాను పోస్టు చేసి రివార్డు కూడా ఇస్తానని వర్మ ఆఫర్ చేశాడు. ఆర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని రాజమౌళిని కూడా కోరాడు. నిజానికి ‘ఫేక్’ అని తాను అనడం లేదని, వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ అంటున్నారని, వారి ఆట కట్టించేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా తాను ఈ చాలెంజ్ విసిరానని పేర్కొన్నాడు.