ఈ ఏడాది సాధారణ వర్షపాతమే: ఐఎండీ అంచనా

17-04-2021 Sat 06:42
  • 96 నుంచి 104 శాతం వర్షపాతం
  • తెలంగాణలో సగటు కంటే అత్యధికం
  • ఏపీలోని వివిధ ప్రాంతాల్లో అటూ ఇటుగా
  • అంచనాలు వెల్లడించిన ఐఎండి
Satisfactory Rains This Year IMD Forecast

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం ఉంటుందని, నైరుతి రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తాజాగా, తన తొలి దశ దీర్ఘ శ్రేణి అంచనాలను వెల్లడించిన ఐఎండీ, ఈ సంవత్సరం 96 నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలో అధికంగా, ఏపీలోని ఉత్తరాంధ్రలో అధికంగా, కోస్తాంధ్రలో తక్కువగా, రాయలసీమలో సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురుస్తుందని పేర్కొంది.

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న భూ శాస్త్ర శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రాజీవన్ ఈ విషయాలు వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య 98 శాతం దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఉంటుందని అన్నారు. కాగా, జూన్ తొలి వారంలో దక్షిణ కేరళను తాకే నైరుతి రుతుపవనాలు, సెప్టెంబర్ లో రాజస్థాన్ నుంచి తిరోగమిస్తాయి. ఇప్పటికైతే పసిఫిక్, హిందూ మహా సముద్రంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని, ఉపరితల ఉష్ణోగ్రతలు, భారత వాతావరణంపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ సంవత్సరం ఎల్ నినో పరిస్థితులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, డైపోల్ ప్రతికూల పరిస్థితులకు సైతం తక్కువ అవకాశాలే ఉన్నాయని అన్నారు. మే చివరి వారంలో మరోమారు వాతావరణం, వర్షాలపై తమ అంచనాలను వెలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు.