ప్రతి ప్లాంటులో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి: మోదీ

16-04-2021 Fri 22:01
  • దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న మెడికల్ ఆక్సిజన్ కొరత
  • 12 రాష్ట్రాలకు అధిక ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయం
Modi suggets all plants in India to Produce maximum oxygen

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను సమావేశంలో ప్రధాని వివరించారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. దేశంలో ఉన్న అన్ని ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని పూర్తి స్థాయికి పెంచాలని సూచించారని వెల్లడించింది.

దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని సమీక్షను నిర్వహించారు. ఈ 12 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు ఈ నెల 20, 25, 30 తేదీల్లో 4,880 టన్నులు, 5,619 టన్నులు, 6,593 టన్నుల వంతున ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. అవసరాలకు తగ్గట్టుగా విదేశాల నుంచి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.