లాక్ డౌన్ విధించకుండానే కరోనాను నియంత్రించాల్సి ఉంది: జగన్

16-04-2021 Fri 20:31
  • కరోనాను వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది
  • లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది
  • ఇంట్లో ప్రత్యేక గది లేని రోగులను కోవిడ్ సెంటర్లకు పంపించాలి
Should control Corona without imposing lockdown says Jagan

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని... మహమ్మారిని వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కోవిడ్ నియంత్రణకు జిల్లా కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు అందరూ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

రోజుకు 23 లక్షల డోసుల వ్యాక్సిన్ తయారవుతోందని... వ్యాక్సిన్ పై పూర్తి నియంత్రణ కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.19 శాతంగా ఉందని తెలిపారు. పాజిటివిటీ రేటు చిత్తూరు జిల్లాలో అధికంగా ఉందని... ఆ తర్వాతి స్థానాల్లో శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయని వెల్లడించారు.

లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని... అందువల్ల లాక్ డౌన్ విధించకుండానే కరోనాను నియంత్రించాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు. లాక్ డౌన్ అనే మాటే రాకుండా కరోనా నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. అన్ని పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

ఇంట్లో ఐసొలేషన్ కోసం ప్రత్యేక గది లేకపోతే... వారిని కోవిడ్ సెంటర్ కు పంపించాలని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇంటిని మార్క్ చేసి, రోగికి వెంటనే కోవిడ్ కిట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఏఎన్ఎం ఆ ఇంటిని సందర్శించాలని చెప్పారు. రోగి పరిస్థితి బాగా లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్ కు లేదా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.