హరీశ్ శంకర్ మూవీలో తండ్రీకొడుకులుగా పవన్?

16-04-2021 Fri 18:32
  • గతంలో హిట్ కొట్టిన 'గబ్బర్ సింగ్'
  • ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీ
  • అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం  
Pavan kalyan dual role in Harish Shankar movie

పవన్ కల్యాణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటిగా కనిపిస్తుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంచలన విజయానికి సరైన అర్థం చెప్పింది. అప్పటి నుంచి పవన్ తో మరో సినిమా చేయడానికి హరీశ్ శంకర్ ఉత్సాహాన్ని చూపుతూనే వస్తున్నాడు. కానీ పవన్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం .. రాజకీయాల్లోకి వెళ్లడం వంటి కారణాల వలన కుదరలేదు. ఆ తరువాత సినిమాలు చేయడానికి పవన్ ఆసక్తిని చూపగానే, ఆయనకి ఒక కథను వినిపించేసి హరీశ్ శంకర్ ఓకే అనిపించుకున్నాడు.

ప్ర్రస్తుతం సాగర్ .కె చంద్ర దర్శకత్వంలో పవన్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన క్రిష్ దర్శకత్వంలో ' హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత హరీశ్ శంకర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నాడా అని అభిమానులు కుతూహలాన్ని కనబరుస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది మరోటాక్. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా, అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.