తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉంది.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

16-04-2021 Fri 15:24
  • ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ప్రయత్నాలు  
  • గతంలో కంటే ఇప్పుడు కరోనా వేగంగా విస్తరిస్తోంది
  • 25 దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరాం
Oxygen shotage in Telangana says minister Etela Rajender

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత కూడా అధికంగా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఒప్పుకున్నారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత వాస్తవమేనని ఈటల స్పష్టం చేశారు.

అయితే ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గతంలో కంటే కరోనా వేగంగా విస్తరిస్తోందని... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

25 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ను కోరామని ఈటల తెలిపారు. తమ అభ్యర్థనపై ఆయన సానుకూలంగా స్పందించారని... అయితే, ఎలాంటి హామీ మాత్రం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో లాక్ డౌన్ కానీ, నైట్ కర్ఫ్యూ కానీ ఇప్పట్లో విధించే అవకాశం లేదని తెలిపారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని... అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.