మీ అందరినీ నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను: నియోజకవర్గ ప్రజలకు ఎర్రబెల్లి భరోసా

16-04-2021 Fri 14:56
  • నియోజకవర్గంలోని కరోనా బాధితులతో టెలీకాన్ఫరెన్స్
  • ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఎర్రబెల్లి
  • ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని సూచన
I will take care of all corona patients says Errabelli

కరోనా వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... నియోజకవర్గంలోని అందరికీ తాను అందుబాటులో ఉంటానని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

కరోనా సోకిన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అందరికీ తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వైద్య సదుపాయాలు, అంబులెన్స్, ఇతర సదుపాయాలన్నీ కల్పిస్తానని చెప్పారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా అందిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనను కానీ, తన సిబ్బందిని కానీ సంప్రదించాలని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని... మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా బాధితులకు ప్రజాప్రతినిధులందరూ అండగా ఉండాలని చెప్పారు. పోలీసులు కూడా ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించేలా తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్సులో ప్రజాప్రతినిధులు, పోలీసులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.