తమిళ హాస్య నటుడు వివేక్ కి గుండెపోటు

16-04-2021 Fri 14:51
  • కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా కుప్పకూలిన వివేక్
  • చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమమంటున్న ఆసుపత్రి వర్గాలు
  • బాగానే ఉందంటున్న వివేక్ పీఆర్వో
  • నిన్ననే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హాస్యనటుడు 
Tamil Comedian Vivek Hospitalised Due to Heart Attack

తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారని వివేక్ పీఆర్వో నిఖిల్ మురుగన్ తెలిపారు.

వెంటనే ఆయన్ను వడపళనిలోని సిమ్స్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే, ఉదయంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, తనతో మాట్లాడారని మురుగన్ చెప్పారు.

ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెబుతున్నాయి. అయితే, గురువారం వివేక్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ వ్యాక్సిన్ వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో మురుగన్ వదంతులపై స్పష్టతనిచ్చారు.

వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఆయన బాగానే ఉన్నారని, ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదని చెప్పారు. గురువారం కరోనా వ్యాక్సిన్లపై ఆయన స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు.