కరోనా పాజిటివ్​ గర్భిణీకి ప్రసవం.. కడుపులోనే బిడ్డకూ సోకిన వైనం

16-04-2021 Fri 14:04
  • హర్యానాలో అరుదైన ఘటన
  • అక్కడ ఇలాంటి కేసు ఫస్ట్ అన్న డాక్టర్లు
  • కరోనా ఉందని చేర్చుకోని ఆసుపత్రులు
Covid positive during pregnancy Haryana woman gives birth to child infected with disease

తల్లి నుంచి కడుపులోని బిడ్డకూ కరోనా వైరస్ సోకిన అరుదైన ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెప్పారు. అలా పుట్టే పిల్లలు చాలా అరుదు అని వివరించారు. తాజాగా హర్యానాలోని ఆయుష్మాన్ భవ్ అనే ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది.

తొలుత ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రాగా.. ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు రావడంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు. చివరకు ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది.

తర్వాత పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. హర్యానాలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అని ప్రసవం చేసిన డాక్టర్ చెప్పారు. కడుపులో ఉండగానే బిడ్డకు కరోనా సోకడం చాలా అరుదని వివరించారు.