Maharashtra: మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీల్లోనే లక్ష కేసులు.. యూపీలో సండే లాక్​ డౌన్​

  • ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో భారీగా కేసుల పెరుగుదల
  • 16 రాష్ట్రాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
  • 10 రాష్ట్రాల్లోనే 85 శాతం మరణాలు
  • నగరాలు, గ్రామాల్లోనూ ఆదివారం లాక్ డౌన్ ప్రకటించిన యూపీ
  • మాస్క్ లేకుండా రెండో సారి దొరికితే రూ.10 వేల ఫైన్
Sunday Lockdown Imposed in UP

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. సగం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 2,17,353 మంది కరోనా మహమ్మారి బారిన పడితే.. అందులో మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లలోనే లక్ష మందికిపైగా బాధితులున్నారు.

మహారాష్ట్రలో 61,695 మందికి పాజిటివ్ అని తేలగా, యూపీలో 22,339 మంది, ఢిల్లీలో 16,699 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఢిల్లీ, యూపీల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కేసులు పెరుగుతున్నాయి. ఇక, దేశంలోని 10 రాష్ట్రాల్లోనే 80 శాతం దాకా కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పుడు 16 రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ లో రోజువారీ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతమున్న యాక్టివ్ కేసుల్లో 40 శాతానికిపైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి.

ఇటు మరణాలూ కేవలం 10 రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు 85 శాతం మరణాలు ఆయా రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 349, ఛత్తీస్ గఢ్ లో 135 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అయితే, 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.

కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆదివారం లాక్ డౌన్ ను విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆదివారం లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. మాస్క్ పెట్టుకోకపోతే రూ.వెయ్యి జరిమానా వేస్తామన్న ప్రభుత్వం.. రెండోసారి కూడా మాస్క్ పెట్టుకోకుండా దొరికితే రూ.10 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. సండే లాక్ డౌన్ ను ప్రకటించారు.

  • Loading...

More Telugu News