Narendra Modi: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే!

uddhav Thackeray Thanks PM Modi
  • కొవాగ్జిన్ ను తయారు చేసుకునేందుకు అనుమతి
  • హెఫ్ కైన్ ఇనిస్టిట్యూట్ కు అవకాశం
  • నిన్న మహారాష్ట్రలో 61,695 కొత్త కేసులు  
రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య ఆకాశాన్ని అంటుతూ, ప్రమాద ఘంటికలు మోగిస్తున్న మహారాష్ట్రలో, ప్రభుత్వ రంగ సంస్థ హెఫ్ కైన్ ఇనిస్టిట్యూట్ లో వ్యాక్సిన్ తయారీకి అనుమతులు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కృతజ్ఞతలు తెలిపారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ను, సాంకేతికత బదలీ ఆధారిత విధానంలో తయారు చేసుకునేందుకు హెఫ్ కైన్ కు కేంద్రం అనుమతిని మంజూరు చేసింది.

ఈ అనుమతులు ఇవ్వడాన్ని మహారాష్ట ప్రభుత్వం, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, "భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కొవాగ్జిన్ ను తయారు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది" అని పేర్కొంది. కోరగానే అనుమతులు ఇచ్చిందుకు ప్రధానికి ఉద్ధవ్ థాకరే కృతజ్ఞతలు తెలిపారని కూడా సీఎం కార్యాలయం వెల్లడించింది.

అంతకుముందు హెఫ్ కైన్ ఇనిస్టిట్యూట్, సొంతంగా కొవాగ్జిన్ ను తయారు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఉద్ధవ్, కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కేంద్రంలో మాత్రమే ఈ టీకాను తయారు చేస్తున్నారు.

గురువారం రాత్రి వరకూ మహారాష్ట్రలో 26.02 లక్షల మందికి కొవిడ్ టీకాను అందించారు. గురువారం నాడు 61,695 కొత్త కేసులు రాగా, 349 మంది మరణించారు. ప్రభుత్వ గణాంకాల మేరకు ఇప్పటివరకూ 36,39,855 మందికి కరోనా సోకగా, వారిలో 29,59,056 మంది చికిత్స తరువాత రికవరీ అయ్యారు. మరో 59,153 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, ఇండియాలోని మరే రాష్ట్రంలోనూ ఇన్ని యాక్టివ్ కేసులు లేవు.
Narendra Modi
Uddhav Thackeray
COVAXIN
Bharath Biotech

More Telugu News