ఏదో ఒకరోజు సీఎం అవుతా: లోటస్ పాండ్ లో షర్మిల వ్యాఖ్యలు

15-04-2021 Thu 21:20
  • ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష భగ్నం
  • లోటస్ పాండ్ నివాసానికి తరలించిన పోలీసులు
  • తన నివాసంలోనే దీక్ష కొనసాగిస్తున్న షర్మిల
  • సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు
  • తనపై చేయి పడితే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్
YS Sharmila continues her protest in Lotus Pond residence

వైఎస్ షర్మిల ప్రస్తుతం హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ఆమె 72 గంటల ఉద్యోగ దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఒక్కరోజు దీక్షకే అనుమతి ఉందంటూ ఆమెను పోలీసు వాహనంలో లోటస్ పాండ్ నివాసానికి తరలించారు. దాంతో షర్మిల తన నివాసంలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఆమె... ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదో ఒకరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తలను వదిలేంత వరకు మంచినీళ్లు కూడా తాగనని స్పష్టం చేశారు.