తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు... కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం

15-04-2021 Thu 19:41
  • తెలంగాణలో కరోనా తీవ్రం
  • ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ
  • అదేబాటలో తెలంగాణ విద్యాశాఖ
  • మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు రద్దు
  • ఆబ్జెక్టివ్ విధానంలో ఫలితాలు
  • అభ్యంతరాలు ఉంటే పరీక్షలు రాయొచ్చన్న విద్యాశాఖ
Tenth class exams cancelled in Telangana due to covid effect

తెలంగాణలో నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేసిన సర్కారు, తాజాగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు కూడా నిలిచిపోయాయని పేర్కొంది. ఈ క్రమంలో మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.  

ఎస్ఎస్ సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ పద్ధతిలో పదో తరగతి ఫలితాలు నిర్ణయిస్తారని, ఒకవేళ ఫలితాలపై ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే, వారికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఉత్తర్వుల్లో వివరించారు. అయితే ఆ పరీక్షలు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కుదుటపడ్డాకే ఉంటాయని స్పష్టం చేశారు.