షర్మిల దీక్ష భగ్నం... పోలీసులతో వాగ్వాదం సందర్భంగా సొమ్మసిల్లిన వైనం!

15-04-2021 Thu 19:04
  • ఇందిరాపార్కు వద్ద షర్మిల 72 గంటల ఉద్యోగ దీక్ష
  • అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు
  • ఒక్కరోజు దీక్షకే అనుమతి ఉందని స్పష్టీకరణ
  • లోటస్ పాండ్ కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిల
  • తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్న పోలీసులు
Police breaks YS Sharmila protest at Indira Park

తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసేందుకు నిశ్చయించుకున్న వైఎస్ షర్మిల నేడు ఉద్యోగ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద ఆమె 72 గంటల దీక్ష చేపట్టగా, ఒక్క రోజు దీక్షకే అనుమతి ఉందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది కూడా సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉందన్న పోలీసులు, ఆ తర్వాత ఆమెను అక్కడ్నించి తరలించే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అనంతరం, ఆమె పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా చౌక్ నుంచి పాదయాత్రగా లోటస్ పాండ్ కు తరలి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం సందర్భంగా షర్మిల సొమ్మసిల్లిపోయారు. షర్మిల పాదయాత్రతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో పోలీసులు ఆమెను వాహనంలో అక్కడ్నించి తరలించారు.

ఈ సందర్భంగా షర్మిల స్పందిస్తూ, పోలీసులు ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.