Chandrababu: ఎక్కడ చూసినా ప్రజల్లో ఆవేదన నెలకొంది: చంద్రబాబు

  • తిరుపతిలో చంద్రబాబు ప్రెస్ మీట్
  • తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో విస్తృతంగా తిరిగానని వెల్లడి
  • ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వివరణ
  • సీఎం మొద్దునిద్ర పోతున్నాడని విమర్శలు
  • సీఎంలో ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం
Chandrababu press meet in Tirupati

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కోసం నిర్వహించిన ప్రచారం ముగింపు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో తాను విస్తృతంగా తిరిగానని, ఎక్కడ చూసినా ప్రజల్లో ఆవేదన నెలకొందని అన్నారు. తాము ఇప్పటివరకు అధికార పక్ష దోపిడీ గురించి ఏం చెప్పామో, ప్రజల్లో కూడా అవే అభిప్రాయాలు నెలకొన్నాయని వివరించారు.

ధరల పెరుగుదల, ప్రజలపై దాడులు, ఎక్కడ చూసినా సహజ వనరుల దోపిడీ, అవినీతి తదితర అంశాల్లో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతోందన్నారు. అభివృద్ధి జరగకపోగా, రాష్ట్రం అప్పుల్లో నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘన అడుగడుగునా జరుగుతోందని ఆరోపించారు. ఆఖరికి ఏపీలో ఎస్సీలపై 150 దాడులు జరిగాయని అమెరికా ప్రభుత్వం కూడా ఓ నివేదిక రూపొందించిందని వెల్లడించారు. మన కీర్తిప్రతిష్ఠలు ప్రపంచస్థాయికి చేరాయని ఎద్దేవా చేశారు.

ఏపీలో 164 ఆలయాలపై దాడులు జరిగాయని, భారత దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఇన్ని దేవాలయాలపై దాడులు జరగలేదని వివరించారు. తిరుమల పవిత్రత దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టడం, అమాయకులను హత్య చేయడం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. మద్యం, ఇసుక దోపిడీ ఎక్కువైందని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, పేద పిల్లల చదువుకు సీఎం అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు.

గురుకుల పాఠశాలల్లో కనీసం తిండి కూడా పెట్టలేక పిల్లలను ఇంటికి పంపించి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా సీఎం చేసే పరిపాలన అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, వచ్చే నెల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి మొద్ద నిద్ర పోతున్నాడని, తనను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా డీఎన్ డీ బోర్డు పెట్టాడని విమర్శించారు.

అసలు, రాష్ట్రంలో అన్ని అరాచకాలు జరిగితే మనిషన్నవాడెవడైనా చలించిపోతాడని, వెంటనే స్పందిస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం స్పందించే పరిస్థితిలో లేడన్నారు. సంవత్సరంలో 365 రోజులు సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేస్తుంటే తనపైనే రాళ్లు వేసే పరిస్థితి వచ్చిందని, తాను ఫిర్యాదు చేస్తే రాళ్లు పడలేదని పోలీసులు అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. గట్టిగా అడిగితే ఆధారాలు ఇవ్వాలని అంటున్నారు... నేను దొంగలను పట్టిస్తే అప్పుడు విచారణ చేస్తారా వీళ్లు? అని నిలదీశారు.

More Telugu News