విశాఖ జిల్లా దారుణ హత్యలపై వివరాలు తెలిపిన పోలీసులు

15-04-2021 Thu 16:27
  • విశాఖ జిల్లాలో సంచలన హత్యలు
  • ఒకే ఇంట్లో ఆరుగురిపై కొడవలి వేటు
  • అప్పలరాజు ఈ ఉదయం హత్యలు చేశాడన్న పోలీసులు
  • కుమార్తెకు అన్యాయం జరిగిందన్న కక్షతోనే చంపాడని వెల్లడి
  • హత్యకు గురైన వారిలో 6 నెలల పసికందు
Police gives details of Visakha district murders
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుట్టాడలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఒకే ఇంట్లో ఆరుగురిని హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిపారు. జుట్టాడలోని శెట్టిబలిజ వీధిలో ఒకే ఇంటిలో ఈ హత్యోదంతం చోటుచేసుకుందని పేర్కొన్నారు. నేటి ఉదయం 6 గంటలకు అప్పలరాజు ఓ పదునైన కొడవలితో ఈ హత్యలు చేశాడని వెల్లడించారు. కుమార్తెకు అన్యాయం జరిగిందనే కక్షతోనే ఈ హత్యలకు పాల్పడ్డాడని వివరించారు.

బమ్మిడి రమణ (57), బమ్మిడి ఉషారాణి (30), అల్లు రమాదేవి (53), అరుణ (37), ఉదయ్ (4), ఊర్వశి (6 నెలలు)... అప్పలరాజు చేతిలో హత్యకు గురయ్యారని తెలిపారు. ఆ ఇంట్లో మాటు వేసిన అప్పలరాజు... ఒక్కసారిగా హత్యాకాండకు తెరదీశాడని, ఎక్కడివాళ్లను అక్కడే నరికి చంపాడని వివరించారు.

అప్పలరాజుకు నేర చరిత్ర ఉందని, 2012లో ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా, అప్పలరాజు ఇంట్లో యువతికి, మృతుల కుటుంబంలోని ఓ యువకుడికి మధ్య ఉన్న సంబంధమే ఈ దారుణ ఘటనకు కారణమని భావిస్తున్నారు. అటు ఆస్తి వివాదాలు కూడా కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.