అలాంటి శక్తిసామర్థ్యాలు ఉన్న రత్నప్రభనే గెలిపించాలి: పవన్ కల్యాణ్

15-04-2021 Thu 15:37
  • తిరుపతి లోక్ సభ స్థానానికి ఈ నెల 17న పోలింగ్
  • లేఖ విడుదల చేసిన పవన్
  • రత్నప్రభ సమస్యలపై పోరాడే వ్యక్తి అని వెల్లడి
  • పార్లమెంటులో బలంగా గొంతుక వినిపిస్తారని ధీమా
  • ఇతర పార్టీల అభ్యర్థులు కేంద్రం వద్ద మాట్లాడలేరని విమర్శ
Pawan Kalyan says vote for Rathna Prabha

తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ ఓ లేఖ విడుదల చేశారు. తిరుపతి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే రత్నప్రభకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో బలంగా గొంతుక వినిపించి, ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి వివరించి నిధులు తీసుకురాగల సత్తా ఉన్నవాళ్లనే ఎంపీగా ఎన్నుకోవాలని తెలిపారు. అటువంటి శక్తిసామర్థ్యాలు రత్నప్రభకు ఉన్నాయని పవన్ వెల్లడించారు.

గతంలో ఆమె ఐఏఎస్ అధికారిణిగా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారని, ప్రస్తుతం తిరుపతిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారని, తిరుపతి ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఆమెనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు వారి పార్టీ పెద్దల సేవలోనే తరిస్తారని, ప్రజాసేవను విస్మరిస్తారని విమర్శించారు. పైగా వారికి కేంద్రం దగ్గర మాట్లాడే సమర్థత కూడా ఉండదని పేర్కొన్నారు.

తిరుపతి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ఆచార సాంప్రదాయాలను కాపాడడం మనందరి బాధ్యత అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేవాలయాలపై దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తుంటే హేళనగా మాట్లాడుతున్నారని... తిరు నామాలు పెట్టుకునేవారిని చులకన చేస్తూ భక్తుల మనోభావాలు గాయపరిచే మంత్రుల వైఖరిని కచ్చితంగా ఖండించాలని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించడం ద్వారా ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఇక, రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నందున తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని ఓటర్లు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న జరగనుండగా, నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది.